అధికార మదంతో ఊగుతున్న టీడీపీ నేతలకు చంద్రబాబు గట్టి క్లాస్ పీకారు. గత పాలకుల తప్పుల నుంచి నేర్చుకోకపోతే ప్రజలు మళ్ళీ బుద్ధి చెబుతారని వార్నింగ్ ఇచ్చారు.
అధికారం చేతిలో ఉందన్న అహంతో ఎవరూ ఇగోలకు పోవద్దని, క్రమశిక్షణ తప్పితే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత పార్టీ నేతలకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఫ్లెక్సీలు, కుర్చీల కోసం జరిగే గొడవలు పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. గత పాలకుల గర్వాన్ని చూసే ప్రజలు వారికి బుద్ధి చెప్పారని, అదే తప్పును మన నేతలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన తీవ్రస్థాయిలో మందలించారు.
కూటమి ధర్మాన్ని పాటిస్తూ జనసేన, బీజేపీ నేతలతో కలిసి పనిచేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రంతో రాష్ట్రానికి గ్యాప్ రాకూడదని, పవన్ కల్యాణ్‌తో తనకున్న సత్సంబంధాలు క్షేత్రస్థాయిలో ప్రతిబింబించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలను ఎండగడుతూనే, ప్రజలకు అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలే పార్టీకి బలం, వారి ప్రవర్తనే ప్రభుత్వానికి గౌరవం అని ఆయన గుర్తుచేశారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించడమే మన తక్షణ లక్ష్యం అని చంద్రబాబు పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ ఓట్లు సాధించినప్పుడే మనం బాగా పనిచేసినట్లు లెక్క అని ఆయన స్పష్టం చేశారు. వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా కాకుండా మళ్ళీ మళ్ళీ గెలిచేలా పనితీరును మెరుగుపరుచుకోవాలని హెచ్చరించారు. పనిచేసే వారికే పార్టీలో గుర్తింపు, పదవులు దక్కుతాయని ఆయన తేల్చిచెప్పారు.