సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీపై విపక్షాలను ఘాటుగా విమర్శించారు. ఫాంహౌస్ లోని 'శుక్రాచార్యులను' జనంలో తిరిగే 'మారీచుడు, సుబాహులతో' పోల్చారు.

హైదరాబాద్ శివార్లలోని ఫ్యూచర్ సిటీ భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. రైతుల సహకారాన్ని కోరుతూ, ప్రతిపక్షాల మాటలు పట్టించుకోనని తేల్చి చెప్పారు. అందరూ భాగస్వాములైతేనే అధునాతన నగరం సాధ్యమని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా విపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కొందరు తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని, 'మీరు ఏడుస్తూనే ఉండండి.. నేను చేసుకుంటూ పోతూనే ఉంటా' అని ప్రతిపక్షాలకు చురకలంటించారు. బీఆర్ఎస్ అగ్రనేతలను ఉద్దేశించి, 'శుక్రాచార్యుడు ఫాంహౌస్ లో పడుకున్నాడు.. మారీచుడు, సుబాహుడు జనంలో తిరుగుతున్నారు' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఫ్యూచర్ సిటీ నిర్మాణం అంత సులభం కాదని, అయితే టోక్యో, సియోల్, సింగపూర్‌తో పోటీపడేలా నగరాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యమని రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికోసం రోడ్లు, మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తున్నామని, జూన్ 2లోపు భవన నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. భూములు ఇచ్చే రైతులకు న్యాయమైన పరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

Tags: CM Revanth Reddy, Future City Hyderabad, BRS leaders criticism, Telangana politics, New city development, Political satire, Telangana government, Hyderabad infrastructure