రిపోర్టర్: FutureAndhra News Desk | వర్గం: అంతర్జాతీయం
షెన్‌జెన్ BYD ప్లాంట్‌లో ఈవీలకు అంటుకున్న మంటలు.. భద్రతపై ప్రశ్నలు.. భారత ఈవీ మార్కెట్ విస్తరిస్తున్న వేళ.. ఈ ఘటన నేర్పే గుణపాఠం ఏంటి..?
చైనాలోని షెన్‌జెన్‌లో బీవైడీ (BYD) సంస్థకు చెందిన ప్లాంట్‌లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం ఈవీ భద్రతపై తీవ్ర ఆందోళనలు రేకెత్తించింది.. టెస్టింగ్ కోసం ఉంచిన అనేక ఎలక్ట్రిక్ వాహనాలు కాలిబూది కావడంతో, హాంకాంగ్ స్టాక్ మార్కెట్‌లో బీవైడీ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.. ప్రాణనష్టం తప్పినప్పటికీ, ఈ ఘటన ప్రపంచ ఈవీ మార్కెట్‌కు ఒక గట్టి వార్నింగ్ ఇచ్చింది..
అగ్నిప్రమాదానికి అసలు కారణం..
సాధారణంగా ఈవీ ప్రమాదాలు అనగానే అందరి దృష్టి బ్యాటరీల వైపు మళ్లుతుంది.. కానీ, బీవైడీ యాజమాన్యం, స్థానిక అగ్నిమాపక శాఖ జరిపిన ప్రాథమిక దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.. ఈ ప్రమాదానికి వాహనాలు గానీ, బ్యాటరీల సెల్ఫ్-ఇగ్నిషన్ గానీ కారణం కాదని స్పష్టమైంది.. పార్కింగ్ ఏరియా సమీపంలో జరుగుతున్న నిర్మాణ పనుల్లో జరిగిన పొరపాట్ల వల్లే ఈ మంటలు చెలరేగాయని నిర్ధారించారు..
భద్రతపై కొత్త చర్చ.. భారత్‌కు గుణపాఠం..
ఈ ప్రమాదంతో ఫ్యాక్టరీలోని ప్రధాన ఉత్పత్తి కేంద్రాలకు, డెలివరీ చేయాల్సిన వాహనాలకు ఎలాంటి నష్టం జరగలేదని బీవైడీ ప్రకటించింది.. అయినా ఈ ఘటన ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చను లేవనెత్తింది.. భారత్ కూడా ఈవీల వినియోగాన్ని వేగంగా ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో, ఇటువంటి ప్రమాదాలకు బాహ్య కారణాలు కూడా దారితీయాచ్చనే స్పృహ చాలా అవసరం.. బ్యాటరీలోపం కానప్పుడు, ఇటువంటి ఘటనలకు కంపెనీలు ఎలా బాధ్యత వహిస్తాయి..?
ఆధునిక బ్యాటరీల భద్రత..
బీవైడీ వంటి సంస్థలు ప్రస్తుతం 'లిథియం ఐరన్ ఫాస్ఫేట్' (LFP) ఆధారిత బ్లేడ్ బ్యాటరీలను వాడుతున్నాయి.. ఇవి సాధారణ లిథియం అయాన్ బ్యాటరీల కంటే ఎక్కువ వేడిని తట్టుకోగలవు.. సురక్షితమైనవని నిపుణులు చెబుతున్నారు.. ఆధునిక ఈవీలలో బ్యాటరీ ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు అత్యాధునిక 'కూలింగ్ సిస్టమ్స్' ఉంటున్నాయి.. కేవలం బ్యాటరీల లోపాలే కాకుండా, బాహ్య కారణాలు కూడా ఈవీ భద్రతకు ముప్పు కలిగించగలవని ఈ ఘటన స్పష్టం చేసింది..
ఈవీ మార్కెట్ శరవేగంగా విస్తరిస్తున్న ఈ తరుణంలో, భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేయడం తప్పనిసరి.. బ్యాటరీల నాణ్యతతో పాటు, తయారీ కేంద్రాలు, పార్కింగ్ ప్రాంతాలలో కూడా పటిష్టమైన భద్రతా చర్యలు ఉండాలి.. లేదంటే వినియోగదారుల్లో నమ్మకం సన్నగిల్లి, ఈవీ విప్లవం మందగించే ప్రమాదం ఉంది..