దిగ్గజ నిర్మాత ఆర్.బి. చౌదరి అకాల మరణం సూపర్ స్టార్ రజనీకాంత్‌ను తీవ్ర కలచివేసింది. తమ కాంబినేషన్లో రావాల్సిన 100వ సినిమా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇక ఎప్పటికీ నెరవేరదని ఆయన కన్నీరు పెట్టుకున్నారు.
టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్.బి. చౌదరి ఆకస్మిక మరణం సౌత్ ఇండస్ట్రీని తీవ్రంగా కలచివేసింది. ఉదయ్పుర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందడం ఫ్యాన్స్‌కు జీర్ణించుకోలేని విషయంగా మారింది. ఈ వార్త విన్న వెంటనే సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయనకు నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఒక గొప్ప నిర్మాతను, మంచి స్నేహితుడిని కోల్పోయామంటూ ఎమోషనల్ అయ్యారు.
నాలుగు నెలల క్రితం 'జైలర్ 2' షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని రజనీకాంత్ పంచుకున్నారు. "నేను ఇప్పటి వరకు 99 సినిమాలు నిర్మించాను. నా 100వ సినిమా మీతోనే తీసి రిటైర్ అవుతాను" అని చౌదరి అడిగారట. దానికి తాను ఖచ్చితంగా చేస్తానని రజనీ మాటిచ్చారు. కానీ, ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కక ముందే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. చౌదరి నిర్మాణంలో రజనీకాంత్ ఏ సినిమా చేయకపోయినా.. వారిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం ఈ సంఘటనతో మరోసారి ఇండస్ట్రీకి తెలిసింది.
ఆర్.బి. చౌదరి అంటే కేవలం నిర్మాత మాత్రమే కాదు.. ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు. సుస్వాగతం, సూర్యవంశం, సంక్రాంతి లాంటి ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్తో ఆయన టాలీవుడ్ బాక్సాఫీస్‌ను ఏలారు. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా ప్రాక్టికల్‌గా ఉండే ఆయన.. ప్రస్తుతం విశాల్ హీరోగా తన 99వ సినిమా 'మకుటం' నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీ ప్రముఖులంతా కలిసి చౌదరికి భారీ సన్మానం చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఇంతలోనే ఆయన కన్నుమూయడం జీవా కుటుంబంతో పాటు యావత్ సినీ లోకంలో విషాదాన్ని నింపింది.